NTV Telugu Site icon

Petrol Fraud: చిప్‌తో పెట్రోల్ నొక్కేస్తున్నారు.. బంకుల్లో వెలుగుచూసిన భారీ మోసం

Petrol Fraud

Petrol Fraud

Petrol Fraud: హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ చిప్‌లతో పెట్రోల్‌కు గండి కొడుతున్నారు బంక్ యజమానులు. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఎస్వోటీ ఆకస్మిక సోదాల్లో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

శివరాంపల్లి ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన జీవైఎస్ రెడ్డి పెట్రోల్ బంకుపై సోదాలు చేపట్టగా.. పెట్రోల్, డీజిల్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ సహాయంతో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చిప్‌తో లీటర్‌కు 10 రూపాయల గండి కొడుతూ వాహనదారులను బంక్ యజమాని నిలువు దోపిడీ చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతోంది. చిప్‌లు అమర్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు.. అతడిని విచారించారు. నగర వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో చిప్స్ అమర్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి.. కురుస్తున్న పొగమంచు

పట్టుబడ్డ నిందితుడి సహాయంతో దాడులు మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్‌లపై అధికారులు దాడులు చేశారు. తూనిక కొలతల, పౌరసరఫరాల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్థానిక పోలీసులకు ఎస్వోటీ సమాచారం అందించగా.. రంగంలో దిగిన అధికారులు. మూకుమ్మడిగా దాడులతో జరుగుతున్న మోసం గుట్టు రట్టు చేశారు. బంక్‌లో చిప్‌లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. యజమానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డీలర్‌ షిప్‌ను అధికారుల బృందం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

Show comments