VC Sajjanar: హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం జరిగింది.
READ ALSO: IND vs SA 4th T20: భారత్- సౌతాఫ్రికా 4వ T20 మ్యాచ్ రద్దు..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు. సమావేశంలో నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్థుల కదలికలపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి క్షేత్రస్థాయి అధికారులు తీసుకువచ్చారు. పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని సీపీ సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి అన్నది చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై మూడు కమిషనరేట్ల పోలీసులు ఉమ్మడి నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, నేరస్థులు తరచుగా వారి నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో నేరాలతో పాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణపైనా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నగరంలోకి వచ్చే భారీ వాహనాల ‘నో ఎంట్రీ’ సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు రోడ్లపైకి రాకుండా, నగరం వెలుపలే నిలువరించాలని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు జటిలమవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమన్వయంతో అడుగులు వేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డెవిస్, గజరావు భూపాల్ తో పాటు మూడు కమిషనరేట్లకు చెందిన డీసీపీలు పాల్గొన్నారు.
READ ALSO: ‘Akhanda 2’ 3D Show: అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో చూసిన బోయపాటి..
