Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!

Hyd

Hyd

Hyderabad: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ రేస్ క్లబ్ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట దందాను చాదర్‌ఘాట్ పోలీసులు బట్టబయలు చేశారు. రేస్ క్లబ్ సమీపంలోని GP హబ్ భవనంలో జోరుగా సాగుతున్న మూడు ముక్కల పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేసి 12 మంది జూదరులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28 రాత్రి మలక్‌పేట పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనే ఉన్న GP హబ్ బిల్డింగ్‌లో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు చాదర్‌ఘాట్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, మలక్‌పేట ఏసీపీ అనుమతితో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం, రాత్రి 10:30 గంటల సమయంలో స్వతంత్ర సాక్షుల సమక్షంలో ఆ భవనంపై మెరుపు దాడి నిర్వహించింది.

ఈ దాడిలో 12 మంది జూదరులను పట్టుకోగా, నిర్వాహకులుగా భావిస్తున్న యాదయ్య, దేవాతో పాటు భవన యజమాని మహమ్మద్ గౌస్ పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి రూ. 1,76,170 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 4 సెట్ల పేక ముక్కలను పోలీసులు పంచనామా కింద స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద క్రైమ్ నంబర్ 423/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.