Site icon NTV Telugu

Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..

Suicide

Suicide

హైదరాబాద్ పాతబస్తీలో కలకలం రేపిన యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. పది రోజులుగా ఆచూకీ లేని యువకుడు ఓ పాడుబడిన బావిలో శవమై తేలడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న నేరాలు, అనుమానాస్పద మరణాల నేపథ్యంలో ఈ ఘటన పోలీసులకు సవాలుగా మారింది.

బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..
హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ కుమార్ (20) అనే యువకుడు గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. మార్చి 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన గౌతమ్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.

Also Read:Minister Komati Reddy: డబుల్ డెక్కర్ కారిడార్‌గా హయత్‌నగర్-L.B నగర్ రూట్.. మంత్రి కోమటి రెడ్డి..

అయితే.. మార్చి 13వ తేదీ రాత్రి రాజన్న బావి సమీపంలోని ‘పులమ్మ బావి’ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో చూడగా ఒక మృతదేహం కనిపించింది. ట్యాంక్ బండ్ శివ బృందం సహాయంతో మృతదేహాన్ని వెలికితీయగా.. అది గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి, అస్థిపంజరంలా మారిపోయింది.

హత్యా? ఆత్మహత్యా?
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అది అదృశ్యమైన గౌతమ్ కుమార్‌దిగా ప్రాథమికంగా గుర్తించి… పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారుజ పది రోజుల పాటు యువకుడు ఎక్కడ ఉన్నాడు..? ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన పాతబస్తీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version