Site icon NTV Telugu

Hyderabad New Year Traffic Rules: న్యూ ఇయర్ వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సిందే

new year hyd

I1wlmbzr

న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్‌లో ఓ రేంజ్ లో జరగనున్నాయి. అయితే ఈ వేడుకల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని, వీటిని అంతా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇవి అమలు చేస్తున్నారు. రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్‌హౌస్‌ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు వుంటాయని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, నగరం నుంచి ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీద నుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఎలా అంటే?

* సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను షెయిలింగ్‌ క్లబ్‌ వద్ద కవాడిగూడ క్రాస్‌రోడ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.
* ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌మార్గ్‌ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలను రాజ్‌భవన్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.
* బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌ వైపు మళ్లిస్తారు.
* లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్‌ మినార్‌ వైపు నుంచి రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
* ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ వద్ద సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌, లక్డీకాపూల్‌ వైపు వెళ్లాలి.
* మింట్‌ కంపౌండ్‌ నుంచి సచివాలయం వెళ్లే లైన్‌లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
* నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్‌ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌, మినిస్టర్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

Exit mobile version