GHMC : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 500 మంది సిబ్బంది ఎన్నికల డ్యూటీలో పాల్గొననున్నారు. వీరిలో 250 మంది పోలీసులున్నారు. భద్రతా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఈనెల 25న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ మరియు కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో “నోటా” ఎంపిక ఉండదని, అలాగే పార్టీలకు విప్ జారీ ఉండదని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేయొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపామని వెల్లడించారు. ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసినట్టు తెలియజేశారు. ఓటింగ్ ప్రాధాన్యత పద్ధతిలో జరగనుంది. ఓటర్లు తమ ఇష్టమైన అభ్యర్థికి పెన్‌తో “1”, “2” అంటూ సంఖ్యలు రాయాల్సి ఉంటుంది. కేవలం ఒక్క అభ్యర్థిని ఎంచుకోదలచిన ఓటర్లు “1” నెంబర్ మాత్రమే రాయాలని, “One”, “Two” అని రాస్తే లేదా సంతకం చేస్తే ఓటు చెల్లదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ఏర్పాట్లు సమర్ధవంతంగా పూర్తయ్యాయని, రేపటి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు.
