NTV Telugu Site icon

Hyderabad Metro : మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లకు వినూత్న మెట్రో మార్గాలు

Metro

Metro

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, శామీర్ పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు. ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ); జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ ల విషయంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు నేడు (ఆదివారం) క్షేత్ర పరిశీలన జరిపారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాటులో ఇంజినీరింగ్ పరంగా ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలను గుర్తించారు.

బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుండి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాల ఎక్కువగా ఉండటం , విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా, హెచ్ఏండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్‌మెంట్‌ను బేగంపేట విమానాశ్రయం (తాడ్‌బండ్/బోయినపల్లి వైపు) రన్‌వే క్రింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది.

హెచ్ఎండీఏ మార్గానికి అనుసంధానంగా రెండు స్థాయిల పైన ఉండే డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఈ భూగర్భ సొరంగంలోనికి దింపి, మళ్ళీ రెండు స్థాయిల ఎలివేటేడ్ మార్గంగా పైకి తీసుకురావడం అనేది ఇంజినీరింగ్ పరంగా అనేక సమస్యల్ని సృష్టిస్తుంది.

ఈ సమస్యలను విశ్లేషించి అనువైన మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి మెట్రో అధికారులు నడుం బిగించారు. ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్ ల ప్రారంభం స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక హబ్ ని ఏర్పాటు చేయడం, ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి, రెండు మెట్రో కారిడార్లు గా రూపొందించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన క్షేత్ర పర్యటనను కొనసాగించారు మెట్రో ఎండీ. తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లపై పూర్తిగా నడిచి, సాధ్యమైనంత ఉత్తమమైన మెట్రో రైలు అలైన్‌మెంట్‌ ఏర్పాటుకు పరిశీలనలు జరిపారు.

జేబీఎస్ – సికింద్రాబాద్ క్లబ్‌రోడ్, స్టాఫ్ రోడ్ (పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ రోడ్), మడ్ ఫోర్ట్ రోడ్, టివోలి జంక్షన్ రోడ్, డైమండ్ పాయింట్ జంక్షన్, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్‌పేట్ జంక్షన్, బోయినపల్లి (సరోజిని పుల్లారెడ్డి బంగ్లా) రోడ్; తాడ్‌బండ్-ఆంజనేయ స్వామి ఆలయం రోడ్ – తాడ్‌బండ్ జంక్షన్ – ఎయిర్ పోర్ట్ ఆఫీస్ జంక్షన్ – బోయినపల్లి చెక్ పోస్ట్ రోడ్ మొదలైనవి వీరు కాలినడకన పరిశీలించిన మార్గాలలో ఉన్నాయి. క్లిష్టమైన మలుపులను, విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్ ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా, ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. అలైన్‌మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూముల లభ్యత, మెరుగైన పార్కింగ్, ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలని కూడా ఆయన ఆదేశించారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా జేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్‌లను కలపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని శ్రీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల బేగంపేట్ విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్‌మెంట్‌ను తీసుకెళ్లాల్సిన పరిస్థితిని నివారించి, బోయినపల్లి రోడ్ (సరోజినీ పుల్లారెడ్డి బంగ్లా పక్కన) చివరన ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్‌మెంట్‌ను అనుసంధానించవచ్చని, అక్కడ నుండి ఇప్పటి కే విస్తరించి న జాతీయ రహదారి సర్వీస్ లేన్ పై మెట్రో స్తంభాలను, వయాడక్టును జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని అన్నారు. దీనితో మేడ్చల్-జేబీఎస్-ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట-విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని, దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. జేబీఎస్-శామీర్ పేట్ మెట్రో అలైన్‌మెంట్ విషయానికొస్తే, సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుండి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్‌గా కరీంనగర్ హైవేపై హెచ్‌ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌పై నేరుగా పొడిగించవచ్చని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్ , నగరంలోని ఉత్తర ప్రాంతాల నివాసితుల రాకపోకలు , ఇతర అవసరాలను తీర్చడానికి జేబీఎస్ ను ఒక ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌గా అభివృద్ధిచేసే ప్రణాళికలు రూపొందిస్తామని మెట్రో ఎండీ తెలిపారు. ఇందు కోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని ఆయన వెల్లడించారు. ఈ క్షేత్ర పర్యటనలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు బి.ఎన్. రాజేశ్వర్, ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, ఎ. బాలకృష్ణ, డిప్యూటీ సిఇ (రైల్వేస్) జె.ఎన్. గుప్తా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?