హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు పలు ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించింది.
మెట్రో విస్తరణ..
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని చేరువ చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించింది. ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల మొదటి దశ (Phase-I) మెట్రో నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండవ దశ (Phase-II A) లో 76.4 కిలోమీటర్లు, Phase-II B కింద 86.1 కిలోమీటర్ల పొడవైన కొత్త మార్గాల ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది.
ప్రభుత్వ స్వాధీనంలోకి మెట్రో ఫేజ్-1..
ప్రస్తుతం నడుస్తున్న మెట్రో మొదటి దశ ప్రైవేట్ భాగస్వామ్యంతో (L&T సంస్థ నిర్వహణలో) కొనసాగుతోంది. అయితే.. రెండవ దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పూర్తి ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కొన్ని సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణాపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒకే నగరంలో రెండు వేర్వేరు నిర్వహణ పద్ధతులు ఉండటంపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Also Read:Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ Polo EV లీక్.. లాంచ్‌కు ముందే కార్ డిటైల్స్..
ఈ అడ్డంకులను తొలగించేందుకు, ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1 నెట్‌వర్క్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి శాసనసభ ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది.
వేగవంతమైన అడుగులు..
మెట్రోను ప్రభుత్వ పరం చేయడం ద్వారా నిర్వహణలో ఏకరూపత రావడమే కాకుండా, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. ఫేజ్-2 విస్తరణ పనులకు కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని సభ కోరింది.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో మెట్రో పాత్ర కీలకం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా.. శివారు ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం సులభతరం అవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద రవాణా నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
