Loan App Harassment: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల అక్రమ దందా, సైబర్ నేరగాళ్ల కిరాతక వేధింపులకు హైదరాబాద్‌లో మరో ప్రాణం బలయ్యింది. చట్టాన్ని రక్షించాల్సిన ఓ పోలీసు కానిస్టేబుల్ లోన్ యాప్ నిర్వాహకుల బ్లాక్‌మెయిలింగ్‌కు తలవంచి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనుగా గుర్తించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడిన శ్రీను, డబ్బుల అవసరాల కోసం పలు ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నాడు.
రుణంగా తీసుకున్న మొత్తాన్ని చెల్లించినప్పటికీ లోన్ యాప్ నిర్వాహకులు అతడిని వదల్లేదు. నిబంధనలకు విరుద్ధమైన చార్జీలు, చక్రవడ్డీల పేరిట నిరంతరం వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా బాధితుడి న్యూడ్ మార్ఫింగ్ ఫొటోలను తయారు చేసి అతడి ఫోన్‌కు పంపించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ అశ్లీల ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
సమాజంలో ఎంతో గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తనకు ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ ఎదురుకావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సదరు న్యూడ్ ఫొటోలు బయటపడితే సమాజంలో పరువు పోతుందన్న తీవ్ర భయాందోళనతో కానిస్టేబుల్ శ్రీను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడిన కాల్స్, డిజిటల్ లావాదేవీలు, లోన్ యాప్ ముఠా వివరాలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

