Hyderabad: ఐవీఎఫ్, ఫెర్టిలిటీ, ఏఆర్టీ సెంటర్ల పేరుతో జరుగుతున్న భారీ అక్రమ దందాపై మల్కాజిగిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకొచ్చి, వారి నుంచి బలవంతంగా అండాలను సేకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి, 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేసి, అండాల సేకరణ దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను ఏర్పాటు చేసినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. అమిత్ శర్మ, దుర్గా ప్రసాద్ లను అరెస్ట్ చేసిన తర్వాతే ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయని సీపీ సుమతి తెలిపారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న బేగంపేట్ పోలీసులు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆరు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారని సీపీ ఆరోపించారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన యువతులను ట్రాప్ చేసి, మంచి జీతం, షెల్టర్ ఇప్పిస్తామని నమ్మించి తీసుకొస్తున్నారని విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. పలు ఐవీఎఫ్ కేంద్రాలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నడుపుతూ, అక్కడే అక్రమ దందాలు నడుపుతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జీతానికి ఆశపడి వచ్చిన యువతుల నుంచి బలవంతంగా అండాలను సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అమ్మాయికి హార్మోన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్నారని, ఒక్కో యువతి నుంచి పదేపదే అండాలను సేకరించడం వల్ల వారి ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతోందని సీపీ సుమతి ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిల ప్రాణాలతో ఐవీఎఫ్ సెంటర్లు చెలగాటం ఆడుతున్నాయని ఆమె అన్నారు. ఈ వ్యవహారంలో గుజరాత్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ముఠా సభ్యులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మెడికల్ డిపార్ట్ మెంట్ అనుమతి లేకుండానే అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అండాల సేకరణ వివరాలను తప్పనిసరిగా మెడికల్ డిపార్ట్ మెంట్ లో, ఏఆర్టీకి నమోదు చేయాలి. కానీ యువతుల వివరాలను ఏఆర్టీకి ఇవ్వకుండానే అండాలను సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి తప్పుడు సమాచారాన్ని ఏఆర్టీకి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం వచ్చిన యువతుల ఆధార్ కార్డుల అడ్రస్ లు మార్చి ఏఆర్టీకి సమర్పిస్తున్న ప్రవీణ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఏఆర్టీ సెంటర్లే అక్రమాలకు అడ్డాగా మారాయని సీపీ సుమతి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏఆర్టీ సెంటర్ల అనుమతులు తీసుకుని, ఇక్కడ అక్రమంగా నడుపుతున్నట్లు విచారణలో తేలిందని ఆమె చెప్పారు. ఈ కేసులో భాగంగా అధికారులు ఏకంగా 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
నోటీసులు అందుకున్న వాటిలో ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ,పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, నోవా ఫెర్టిలిటీ సెంటర్, బటర్ ఫ్లై ఫెర్టిలిటీ సెంటర్, ఇందిరా ఫెర్టిలిటీ సెంటర్, నర్మదా ఫెర్టిలిటీ సెంటర్, బిర్లా ఫెర్టిలిటీ సెంటర్, అన్వి ఫెర్టిలిటీ సెంటర్, కాంశివ ఫెర్టిలిటీ సెంటర్, మర్రి తులసి రెడ్డి సెంటర్, 49 ఫెర్టిలిటీ సెంటర్, మమత ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్టీ సెంటర్, నోవా ఐవీఎఫ్ సెంటర్, ఫాతిమా ఫెర్టిలిటీ సెంటర్, ఆరాధ్య ఐవీఎఫ్ సెంటర్ తదితరాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా, అండాల సేకరణ వివరాలు సక్రమంగా నమోదు చేశారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్న ఐవీఎఫ్, ఫెర్టిలిటీ, ఏఆర్టీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సుమతి హెచ్చరించారు. అండాల సేకరణ దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని ఆమె ప్రకటించారు. ఈ కేసులో మరింత మంది నిందితుల ప్రమేయం ఉందా, ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

