Hyderabad: రాజధాని నగరం హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో ఉన్న హయగ్రీవ హాస్పిటల్‌లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించి సీక్రెట్ రాకెట్‌ను ఛేదించారు. ఈ కేసులో హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్‌తో పాటు.. తుక్కుగూడ శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. మహిళా పోలీసును డికాయ్ గా హయగ్రీవ హాస్పిటల్‌కు పంపారు. అక్కడ సదరు మహిళా పోలీసుతో హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ ఇద్దరూ కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. వారికి తెలిసిన తుక్కుగూడలో ఉన్న విజయ్ కుమార్ స్కాన్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడ.? మగా.? అని చెబుతాడని రెఫర్ చేశారు.
దీంతో పోలీసులు వెంటనే తుక్కుగూడ వద్ద శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లోని ల్యాబ్‌పై దాడి చేశారు. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. PCPNDT చట్టం ప్రకారం గర్భంలోని శిశువు లింగాన్ని తెలియజేయడం నిజానికి నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం పోలీసులు హెచ్చరించారు. ఆడపిల్లల లింగ వివక్షకు వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్రమ లింగ నిర్ధారణలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

