Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..

Telangana Heavy Rains

Telangana Heavy Rains

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే వాతావరణ శాఖ (IMD) రాబోయే ఆరు రోజుల పాటు (మార్చి 16 నుండి 21 వరకు) తెలంగాణలో ఉరుములు, మెరుపులు. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో.. అంచనాలకు తగ్గట్టుగానే నగరం అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లతో పాటు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ మరియు పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడ్డారు.

రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది. ముఖ్యంగా పంజాగుట్ట, హైటెక్ సిటీ ఫ్లైఓవర్లు, మెయిన్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు మందగించాయి. వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరద నీటిని తొలగించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలను రంగంలోకి దించారు. నాలాల వద్ద, మ్యాన్‌హోల్స్ దగ్గర పేరుకుపోయిన చెత్తను తొలగించి.. నీరు త్వరగా వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు.
లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే కొద్ది రోజులు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా.. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.