హైదరాబాద్ నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ‘అర్బన్ ఫారెస్ట్ పార్క్’ రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ, ఆమన్గల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ భూములను ’రిజర్వ్ ఫారెస్ట్’గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మార్చి 13, 2026) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నగర పర్యావరణానికి పెద్ద పీట వేయనుంది. సుమారు 424 ఎకరాల 31 గుంటల భారీ విస్తీర్ణంలో ఈ అటవీ భూభాగం విస్తరించి ఉంది. తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం.. పర్యావరణ, అటవీ శాఖ G.O.Ms.No.7 ద్వారా ఈ హోదాను కల్పించింది. ఈ భూముల్లోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామానికి చెందిన 102 ఎకరాలపై సుదీర్ఘ కాలంగా కోర్టులో వివాదం నడిచింది. దీనిని ‘సాహెబ్‌నగర్ కలాన్ కేసు’గా పిలుస్తారు. చివరకు సుప్రీంకోర్టు అటవీ శాఖ వాదనను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో ఆక్రమణదారుల నుంచి ఈ భూమికి విముక్తి లభించింది.
Also Read:Gas Effect: గ్యాస్ కొరత.. పెరిగిన హోటల్ ఫుడ్ ఐటమ్స్ ధరలు..
నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో… ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే ‘గ్రీన్ లంగ్ స్పేస్’గా దీనిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకుల కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కుటుంబాలతో కలిసి వారాంతాల్లో సమయాన్ని గడిపేలా విశ్రాంతి ప్రదేశాలు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు రానున్నాయి. అడవుల ప్రాముఖ్యతను వివరించేలా నాలెడ్జ్ సెంటర్లను ఇక్కడ నిర్మించే అవకాశం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ హోదా రావడం వల్ల ఇక్కడ ఉన్న స్థానిక వృక్ష సంపద, జీవవైవిధ్యానికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఇకపై ఇక్కడ ఎలాంటి అనధికారిక నిర్మాణాలు లేదా ఆక్రమణలకు తావు ఉండదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే ఉన్న గజ్వేల్, శామీర్‌పేట వంటి అర్బన్ పార్కుల తరహాలోనే.. గుర్రంగూడ పార్క్ కూడా బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, సాగర్ రోడ్ ప్రాంతాల వారికి ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది.
