Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!

Fire Accident

Fire Accident

Hyderabad Fire Accident: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బౌరంపేట బొడ్రాయి సమీపంలోని ఒక గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గ్యారేజ్‌లో బస్సులన్నీ పక్కపక్కనే పార్క్ చేసి ఉండటంతో మంటలు ఒకదానికొకటి వేగంగా వ్యాపించాయి. ప్రమాద స్థలానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు బెంబేలెత్తిపోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గ్యారేజ్ సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.