Site icon NTV Telugu

Hyderabad Crime: ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై డాన్స్

Murder

Murder

Hyderabad Crime: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఓ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసిన యువకుడు స్థానికులను, పోలీసులను షాక్‌కు గురిచేశాడు. ఈ హృదయ విదారక ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడలో ఒంటరిగా జీవిస్తున్న కమలాదేవి అనే వృద్ధురాలు తనకు చెందిన షాపులో ఓ యువకుడికి అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. అద్దె విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కమలాదేవి ఆ యువకుణ్ణి మందలించినట్టు తెలుస్తోంది. కమలాదేవిపై కోపంగా ఉన్న యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీన ఈ యువకుడు కమలాదేవిని ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన అనంతరం కమలాదేవి మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసిన అతడు, ఆ వీడియోలను తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు సమాచారం పొందారు. దీంతో పోలీసులు కమలాదేవి ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతురాలి హత్యలో నిందితుడిగా భావిస్తున్న యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించి, నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version