Site icon NTV Telugu

Hyderabad Brutal Murder: కంటే కూతుర్నే కనాలి అంటారు.. కానీ ఉసురు తీసిన కూతురు

Off The Record

Off The Record

Hyderabad Brutal Murder: కంటే కూతుర్నే కనాలి అంటారు… కానీ, హైదరాబాద్ జీడిమెట్లలో ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని నిరూపించింది ఓ అమ్మాయి. కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. నవమాసాలు మోసి.. కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. కట్టంగూర్‌కు చెందిన శివ.. డీజేగా పని చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయం అయ్యాడు. దానితో పరిచయం కాస్త ప్రేమమగా మారి, ఇద్దరూ 8 నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కొద్ది రోజుల క్రితం శివతో వెళ్లిపోయింది బాలిక.

3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన బాలికకు పోలీసుల కౌన్సెలింగ్:
కూతురు అదృశ్యంతో కంగారు పడ్డ తల్లి అంజలి.. తెలిసిన చోటల్లా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన బాలికకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. శివను కూడా స్టేషన్‌కు పిలిపించారు. మూడు రోజులు తనతోపాటు కూతురును ఉంచుకోవడంపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను న్యాయం చేయాలని కోరింది. కానీ పోలీసులు నచ్చజెప్పి శివను పంపించేశారు.

Read Also: Gadwal Murder: పెద్ద ప్లానింగే.. సర్వేయర్ హత్య విషయంలో బయటపడుతున్న సంచలన విషయాలు..!

ఇక ఇంటికి వెళ్లిన తర్వాత..తల్లీ కూతుళ్ల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తల్లి మీద కసి పెంచుకుంది బాలిక. ప్రేమను కాదనడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడ కూడా కనీసం తన తల్లి తన బాగోగుల గురించి ఆలోచిస్తుందోనే ఆలోచన కూడా లేకుండా.. కన్న తల్లినే కడతేర్చేందుకు స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ప్రియుడు శివకు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. తమ్ముడు యశ్వంత్‌ను తీసుకుని శివ రాగానే పూజ చేసుకుంటున్న తల్లి తలపై బెడ్ షీట్ కప్పేసింది. ఆ తర్వాత వచ్చీ రాగానే శివ.. బాలిక తల్లిని వీపులో బలంగా తన్నాడు. కిందపడ్డ ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. ఇక సుత్తి తీసుకుని తల్లి తలపై బాదింది బాలిక. వీరిద్దరికీ యశ్వంత్ సహకరించాడు. కాసేపు పెనుగులాడిన తల్లి అంజలి.. ఉలుకూ పలుకూ లేకపోయే సరికి చనిపోయిందని భావించారు. ఈ క్రమంలో శివ అతని తమ్ముడు యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు.

Read Also: Danush : ధనుష్ టాలీవుడ్ టార్గెట్ క్లియర్.. మరోసారి హిట్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ !

వారు అలా వెళ్లగానే ఇంటికి బాలిక చెల్లలు వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి గాబరా పడింది. ఆస్పత్రికి తీసుకు వెళ్దామని చెప్పినా అక్క చలించలేదు. పైగా తల్లి బతికే ఉందని గ్రహించిన ఆ కఠినాత్మురాలు.. నైస్‌గా ఫ్రెండ్‌ను తీసుకు రమ్మని నచ్చజెప్పి.. తిరిగి ప్రియుడు శివకు కాల్ చేసింది. తల్లి ఇంకా చనిపోలేదని.. వచ్చి చంపేయాలని చెప్పింది. దీంతో వెనక్కి వచ్చిన శివ, అతని తమ్ముడు ఆమె గొంతు కోశారు. చనిపోయేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత వెళ్లిపోయారు. చిన్నకూతురు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్క తమ తల్లిని ఎలా చంపిందో ఆమె పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది. అంజలి మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు.

ఇక కూతురు చేతిలో బలైపోయిన అంజలి.. ఆనాడు రజాకార్‌ లకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ మనుమరాలు కావడంతో ఈ హత్య కేసు మరింత సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శివతో పాటు అతని తమ్ముడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం, కుటుంబంలో అవగాహన లోపం వంటి అంశాలపై పెద్ద చర్చ ప్రారంభమైంది.

Exit mobile version