Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!

  • హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • బైక్‌ను ఢీకొట్టిన మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ లారీ
  • లారీ చక్రాల కింద నలిగి తండ్రి, కూతురు మృతి
  • మృతులను ఇస్మాయిల్ ఖాన్, బురుషాన్ బేగంగా గుర్తింపు
  • మరో వారం రోజుల్లో బురుషాన్ బేగం వివాహం..
Hydrabad

Hydrabad

Road Accident: హైదరాబాద్‌లోని ఆరంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

స్థానికుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌ నుంచి అత్తాపూర్‌ వైపు కంకర లోడుతో టిప్పర్ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో ఆరంఘర్‌ చౌరస్తా వద్ద బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురిని టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ లారీ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను అత్తాపూర్‌కు చెందిన ఇస్మాయిల్ ఖాన్, ఆయన కుమార్తె బురుషాన్ బేగంగా గుర్తించారు. మరో వారం రోజుల్లో బురుషాన్ బేగం వివాహం జరగాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో తండ్రి, కూతురు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.