Hyderabad: హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నరరూప రాక్షసుల దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ బాలికపై విక్కీ అనే యువకుడు, అతడి గ్యాంగ్ కలిపి ఏకంగా తొమ్మిది మంది మూడు రోజుల పాటు దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘోర ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించి దర్యాప్తు వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన విక్కీ అనే యువకుడు మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి అపహరించుకుపోయాడు. ఆమెను గుండ్లపోచంపల్లిలోని ఒక ఓయో (OYO) హోటల్‌కు తీసుకెళ్లి, ఆమెకు గంజాయి తాగించి విక్కీతో సహా నలుగురు కలిసి మొదటి రోజు దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు (9వ తేదీన) బాలికను షామీర్‌పేటలోని ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు తరలించి, అక్కడ విక్కీతో పాటు మరో ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
అనంతరం 10వ తేదీన మేడ్చల్‌లో ఆగి ఉన్న ఒక రైలులోకి తీసుకువెళ్లి, విక్కీతో సహా మరిద్దరు కలిసి బాలికపై మళ్లీ లైంగిక దాడికి ఒడిగట్టారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రాంతాలకు తిప్పుతూ, గంజాయి, మత్తు పదార్థాలు ఇస్తూ మొత్తం 9 మంది ఈ ఘోరానికి పాల్పడ్డారు. బాధితురాలి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విక్కీ అండ్ గ్యాంగ్‌లోని 9 మంది యువకులపై పోక్సో (POCSO) చట్టంతో పాటు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు పలువురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు బేగంపేట ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక, ఈ ఘటనలో మైనర్ బాలికను హోటల్‌లోకి అనుమతించి, ఎలాంటి వివరాలు లేకుండా గది కేటాయించినందుకు గాను గుండ్లపోచంపల్లిలోని సదరు ఓయో హోటల్ మేనేజర్ మరియు ఓనర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

