Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ప్రభుత్వ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజనీర్ (DE)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉన్న ఏడో అంతస్తు ఫ్లాట్ సహా రాష్ట్రంలోని మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 10 ప్రత్యేక బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.
సోదాల సందర్భంగా ఇంట్లో విలాసవంతమైన ఖరీదైన చేతి గడియారాలు, 20కి పైగా విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న వాచీల మార్కెట్ విలువను అధికారులు ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. వీటి అసలు ధర, కొనుగోలు వివరాలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇంట్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ఆస్తుల విలువ, కొనుగోలు విధానం, ఆదాయ వనరులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన పత్రాల ఆధారంగా భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.
సోదాల్లో భాగంగా ముత్యం వెంకటరమణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం. వాటిని తెరిచి పరిశీలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాకర్లలో లభించే నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువుల ఆధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముత్యం వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఇంట్లోనే ఉండగా.. వారికి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యేక గదిలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నారు. వారి నుంచి ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

