OTR: ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేవారు.. ఇప్పుడు ఏమైందో ఏమో..

  • పొన్నం, కౌశిక్‌ మధ్య బూడిద లారీలపై మాటల యుద్ధం..
  • తడి బట్టలతో గుళ్ళో ప్రమాణం దాకా వ్యవహారం..
  • ఉన్నట్టుండి మాటలు ఆగినా, లారీలు మాత్రం రన్నింగ్
Ponnam

Ponnam

ఒకప్పుడు ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు ఆ ఇద్దరూ. ఏమైందో…ఏమో… ఉన్నట్టుండి సడన్‌ బ్రేక్‌ పడ్డ కారులా సైలెంట్‌ అయిపోయారు. అది చూసి చాలా మందికి డౌట్‌ కొట్టింది. కానీ… ఉన్నట్టుండి మళ్ళీ యాక్సిలరేటర్‌ తొక్కిన కారులో మాటల యుద్ధంలో దూసుకుపోతున్నారు ఆ మంత్రి, ప్రతిపక్ష ఎమ్మెల్యే? ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతోంది ఫ్రెండ్లీ ఫైటా? లేక సీరియస్‌గానే మేం రాజకీయ ప్రత్యర్థులమని చెబుతున్నారా? లెట్స్‌ వాచ్‌.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి… మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం నడిచింది. బూడిద లారీల వ్యవహారంలో మంత్రిని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే….రోడ్డెక్కి రాద్ధాంతం చేశారు. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారని పదేపదే ఆరోపణలు గుప్పించారు. మాటలతో మొదలైన బూడిద లారీల రవాణా అంశం తడి బట్టలతో దేవుళ్ల మీద ప్రమాణాలు చేసే వరకు వెళ్లింది.

బూడిద లారీలను నిలిపి వేసే వరకు తాను నిద్రపోనని ప్రతిజ్ఞ చేశారు కౌశిక్. కానీ… ఏమైందో ఏమో… ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారాయన. అటు మంత్రి పొన్నంతో పాటు హుజూరాబాద్ కాంగ్రెస్ నేతలు కూడా బూడిద లారీల అంశాన్ని కానీ.. సవాళ్ల పర్వాన్నిగానీ పట్టించుకోలేదు. ఇద్దరు లీడర్ల మధ్య మాటలైతే ఆగిపోయాయి గానీ… బూడిద లారీలు మాత్రం ఆగలేదు. దీంతో… అప్పట్లో అసక్తికరమైన ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య హైదరాబాద్‌లో సయోధ్య కుదిరిందని, ఎవరెవరికి ఏమేం కావాలో అవి అందేలాగా ఓ పెద్దమనిషి డీల్ సెట్‌ చేసినట్టు చెప్పుకున్నారు.

అందుకే మంత్రిగారి విషయంలో ఎమ్మెల్యే సడన్‌గా సాఫ్ట్ కార్నర్ తీసుకున్నారంటూ అటు కాంగ్రెస్ నేతలు సైతం గుసగుసలాడుకున్నారు. మొత్తానికి వారిద్దరి కోసం అనవసరంగా మనమెందుకు రోడ్డెక్కామంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కేడర్‌లో అంతర్మధనం మొదలయ్యే వరకు వెళ్లింది వ్యవహారం. అయితే ఈ ములాఖత్ ప్రచారాన్ని మొదట్లో ఇద్దరు నేతలు లైట్‌ తీసుకున్నారట. కానీ… రానురాను వాళ్ళిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఏదైనా ఇష్యూ జరిగితే ఒంటికాలి మీద లేచే ఎమ్మెల్యే దూకుడు ఎందుకు తగ్గింది..? లాంటి చర్చలు పదే పదే జరుగుతుండటంతో… ఇది ఇంకా పెరిగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి అలర్టయ్యారట.

మంత్రిగారితో దోస్తీ కుదరిందనే ప్రచారం తనకు ఇబ్బందిగా పరిణమించక ముందే మేల్కోవాలని కౌశిక్ డిసైడైనట్టు సమాచారం. అందుకే.. సరైన వేదిక కోసం చూసి… కమలాపూర్ మండంలో మంత్రులు పొన్నం, పొంగులేటిలు హాజరయిన సభకు వెళ్లారనే ప్రచారం సాగుతోంది.. అక్కడ కావాలనే డబుల్ బెడ్‌రూంలు కట్టించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పాలంటూ ప్రస్తావించి మంత్రులను రెచ్చగొట్టారనే అభిప్రాయం ఉంది.

దానికి మంత్రులు మాట్లాడుతూ.. కేసీఆర్ డబుల్ బెడ్‌రూంలు కట్టించలేదని… సగం సగం వదిలేస్తే ప్రజాధనం వృధాకావద్దని వాటిని తాము పూర్తి చేసామని, ఆ మాటకు వస్తే ఈటల హయాంలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. దాంతో ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి మంత్రుల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసారు ఎమ్మెల్యే. తర్వాత రసాభాస జరిగింది. అటు బీఆర్ఎస్… ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పొన్నం జోక్యం చేసుకుని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఇంతలో నినాదాలు చేసుకుంటూ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు.

అయితే… కమలాపూర్‌ ఎపిసోడ్ మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి హుజూరాబాద్‌లో. మంత్రి, ఎమ్మెల్యే మధ్య రహస్య అవగాహన జరిగిందనే ప్రచారానికి చెక్ పెట్టేందుకే కౌశిక్ ఈ వేదికను ఉపయోగించుకున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు కరీంనగర్‌లో తనపై జరిగిన అటాక్ తర్వాత ఆయన బాగా తగ్గారనే అభిప్రాయం కూడా క్యాడర్‌లో ఉందట. కొందరైతే భయాన్ని కళ్లారా చూశాడు కాబట్టి తత్వం బోధపడిందని కామెంట్స్‌ కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే కౌశిక్‌ రెడ్డి కమలాపూర్‌ సభను వాడుకుని ఉంటారన్న అభిప్రాయం బలపడుతోంది. హుజూరాబాద్ ప్రజలు దీన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్నది ఫ్రెండ్లీ ఫైటా లేక రియల్‌ వారా అన్నది ఆసక్తికరంగా మారింది.