మరో వారం రోజుల్లో హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి మిగిలింది మరో నాలుగు రోజులే. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ముఖ్య నేతలంతా అక్కడే మకాం వేసి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజా నాడి ఎలా ఉందనే దానిపై పరిశీలనలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు బరిలో నిలిచినా.. పోటీ మాత్రం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంది.
హుజురాబాద్ బైపోల్ ఈనెల 30న జరగనుంది. నవంబర్2న రిజల్ట్స్. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటివరకు కోటీ 80 లక్షల నగదు, భారీగా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో వ్యయ పరిశీలకుడిని ఈసీ నియమించింది.
నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టేసింది అధికార TRS. మంత్రి హరీష్ రావు నెల రోజులుగా అక్కడే ఉంటూ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. మంత్రులు కొప్పుల, గంగుల కూడా ఫుల్ టైమ్ హుజురాబాద్‌కే కేటాయిస్తున్నారు. ఇక CM కేసీఆర్ సభ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఈసీ ఆంక్షలతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది పార్టీ. ఇక బీజేపీ నుంచి స్టార్ క్యాంపే నర్స్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్లు జితేందర్‌రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు..మండలాల వారీగా క్యాంపేన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో కాస్త వేగం పెంచింది. పూర్తిస్థాయి టీమ్‌ను బరిలోకి దింపింది. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్, వీహెచ్, రేవంత్ మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీల నుంచి ప్రధాన లీడర్లంతా బరిలోకి దిగటంతో మాటల తూటాలు పేలుతున్నాయి. కౌంటర్లు-ఎన్‌కౌంటర్లతో రీసౌండ్ మోతెక్కిపోతోంది. మరి ఓటర్లు ఎవరిపై వైపు మొగ్గుతారన్నది ఉత్కంఠగా మారింది
