ఆ కన్నింగ్ డాక్టర్.. కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అనారోగ్యం ఉందని చెప్పకుండా తనకిచ్చి పెళ్లి చేశారని ఆగ్రహించిన ఆ వైద్యుడు.. ఏకంగా భార్యకు మత్తు మందు ఎక్కువ డోస్ ఇచ్చి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఆధారాలతో సహా విషయం బయటపడడంతో ఆ కంత్రీ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు డాక్టర్ మహేంద్రరెడ్డి , డాక్టర్ కృతికారెడ్డి. వీరిద్దరికి 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో కాపురం పెట్టారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో స్కిన్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నారు. అదే ఆసుపత్రిలో మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కొద్ది రోజులపాటు వారి కాపురం కూడా బాగానే సాగింది. కానీ కృతికా రెడ్డి తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేది. మొదట్లో లైట్‌గానే తీసుకున్నాడు మహేంద్రరెడ్డి. కానీ ఆమెకు పెళ్లికి ముందు నుంచే గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి. తరచుగా వాంతులు, ఇతరత్రా సమస్యలతో బాధపడుతుండేది. ఐతే పెళ్లికి ముందే ఈ సమస్యలు ఉన్నాయని దాచిపెట్టి పెళ్లి చేశారని మహేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నిజానికి ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యలకు వైద్యం చేయిస్తే సరిపోయేది. కానీ కంత్రీ డాక్టర్ కన్నింగ్‌గా ఆలోచించాడు. ఏకంగా భార్యను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23న మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు.
ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఐతే కుటుంబ సభ్యుల అనుమానంతో మహేంద్రరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు పోలీసులు. ఇంటి నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబు పంపించారు. ఈ నెల 13న అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత కుమార్సింగ్ తెలిపారు.
