NTV Telugu Site icon

Tamilnaadu: యూట్యూబ్ చూసి ప్రసవం చేసిన భర్త.. భార్య మృతి

Youtube

Youtube

TamilNaadu: సోషల్ మీడియా యుగంలో గూగుల్, యూట్యూబ్ లలో చూసి ప్రతీది నేర్చుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాటిని చూసి నేర్చుకునే విషయాలు బెడిసికొడుతుంటాయి. వంటలు లాంటివి చెడిపోయిన పెద్ద సమస్య ఉండదు. కానీ కొంత మంది మాత్రం యూట్యూబ్ చూసి ప్రాణాలు పోయే పనులు చేస్తున్నారు. తాజాగా యూట్యూబ్ వీడియోలు చూసి ఓ భర్త తన భార్యకు సహజసిద్ధంగా కాన్పు చేయాలనుకున్నాడు. అయితే అనుకోని విధంగా ఆమె మరణించింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లాలోని అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్​ కు పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి 2021లో వివాహం జరిగింది. మాదేశ్ సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేసేవాడు. పంటల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేసేవాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా అగ్రికల్చర్ లో డిగ్రీ చేశారు. ఇద్దరు సేంద్రీయ పద్దతిలో పండించిన వాటినే తినేవారు. ఇటీవల మాదేశ్ భార్య లోకనాయకి గర్భం దాల్చింది. ఎటువంటి రసాయనాలు వాడకుండా వ్యవసాయం చేసే మాదేశ్, తన భార్య కూడా ఎటువంటి మందులు, వైద్యం అవసరం లేకుండానే సహజంగా బిడ్డను కనాలనుకున్నాడు. దానికి లోకనాయకి కూడా అంగీకరించింది. గర్భవతిగా ఉన్ననప్పుడు అందించాల్సిన ఎటువంటి వైద్యం ఆమెకు అందిచలేదు. అంతేకాదు ఆమెకు ఎటువంటి స్కానింగ్ లు లాంటివి కూడా తీయించలేదు. స్థానిక ప్రభుత్వ వైద్యులు మాదేశ్ భార్య గర్భం దాల్చిందని తెలిసి వైద్యసదుపాయం కల్పించాలని చూసిన దానికి ఆ భర్త నిరాకరించాడు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. అందుకు కూడా మాదేశ్ ససేమిరా ఒప్పుకోలేదు. గర్భం దాల్చిన సమయంలో అందించే వ్యాక్సిన్లతో పాటు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని కూడా వద్దన్నాడు. వైద్యాధికారులు ఒత్తిడి చేయడంతో తన భార్యను తీసుకొని వాళ్ల ఊరికి వెళ్లిపోయాడు. కడుపుతూ ఉన్నప్పుడు కావాల్సిన పౌష్టికాహారం కోసం గింజలు, ఆకుకూరలు అందించేవాడు.

Also Read: Russia: రష్యాలో విమాన ప్రమాదం.. వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి

ఇక ఆగస్టు 22న లోకనాయకికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అయితే అగ్రికల్చర్ చదివిన మాదేశ్ తానే డాక్టర్ కావాలనుకున్నాడు. యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యూట్యూబ్ లో సహజ ప్రసవం ఎలా చేయాలో చూసి నేర్చుకున్నాడు. అనంతరం తన భార్యకు ప్రసవం చేశాడు. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అధిక రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో భయపడిపోయిన మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే మార్గమధ్యంలోనే లోకనాయకి చనిపోయింది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా భార్యను తన ఊరికి తీసుకువెళ్లాలనుకున్నాడు మాదేశ్. అయితే స్థానిక ప్రభుత్వాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు విచారణ చేపట్టి మాదేశ్ ను అరెస్ట్ చేశారు.

Show comments