Aadhaar Update: జస్ట్ 5 నిమిషాల పని.. ఇంట్లో కూర్చుని మీ మొబైల్‌లోనే ఆధార్ అప్డెట్ చేసుకోండిలా..

Aadhaar

Aadhaar

ఆధార్ కార్డు(Aadhaar Card)లో మీ ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా లేదా కొత్త నంబర్ అప్‌డేట్ చేసుకోవాలన్నా ఇకపై ఆధార్ సేవా కేంద్రాలు (Aadhaar Seva Kendra), పోస్ట్ ఆఫీసుల (Post Office) చుట్టూ తిరుగుతూ గంటల తరబడి పెద్ద పెద్ద క్యూ లైన్లలో నిలబడాల్సిన పని లేదు. కేవలం 75 రూపాయల ఫీజుతో, ఇంట్లోనే కూర్చుని మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా చాలా సింపుల్‌గా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. సాధారణంగా ఆధార్ డీటెయిల్స్ మార్చుకోవాలంటే సెంటర్లకు వెళ్లి పడిగాపులు కాయాల్సి వస్తుంటుంది. ఈ కష్టాలకు చెక్ పెడుతూ యూఐడీఏఐ (UIDAI) ఆండ్రాయిడ్ (Android), ఐఫోన్ (iPhone) యూజర్ల కోసం ప్రత్యేకంగా ఆధార్ మొబైల్ యాప్‌ను (Aadhaar Mobile App) అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇంటి నుంచే అనేక ఆధార్ సేవలను (Aadhaar Services) పొందవచ్చు. అందులో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం కూడా ఒకటి.

ఈ ప్రాసెస్ ఎలా చేయాలంటే.. ముందుగా మీ ఫోన్‌లో ఆధార్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని, మీ ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి. యాప్ ఓపెన్ చేశాక, కింది భాగంలో ‘సర్వీసెస్’ (Services) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే లోపల ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోగానే, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలిపే ఓవర్‌వ్యూ, స్టెప్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. అక్కడే అడుగున ఉన్న ‘కంటిన్యూ టు అప్‌డేట్ మొబైల్ నంబర్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి మీకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇందులో భాగంగా ముందుగా మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌ను ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని స్కాన్ చేసి ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరగా ఆన్‌లైన్‌లో 75 రూపాయల ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ పూర్తయిన తర్వాత, మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవ్వడానికి గరిష్టంగా 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డుకు కొత్త మొబైల్ నంబర్ అప్‌డేట్ అయిపోతుంది. ఇలా ఎక్కడికీ వెళ్లకుండా, ఇంట్లో నుంచే మీ మొబైల్‌తో ఈ పనిని సులభంగా పూర్తి చేసుకోవచ్చు.