Site icon NTV Telugu

Hollywood Al Pacino : 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో

Hollywood Star

Hollywood Star

Hollywood Al Pacino : హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, గాడ్‌ఫాదర్‌ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారు. ఆల్‌ పాసినో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్‌ పాసినో.. 29 ఏళ్ల యువతి నూర్‌ అల్ఫల్లాతో కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ప్రస్తుతం నూర్‌ అల్ఫల్లా గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్‌ పాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు వెల్లడించారు. నిర్మాతగా కొనసాగుతున్న నూర్‌తో పాసినోకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వారు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు.

Read Also: Elon Musk: మస్క్ ఈజ్‌ బ్యాక్.. మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

మాజీ ప్రియురాలు మీటల్ దోహన్‌‌తో బ్రేకప్ అయిన వెంటనే అల్ఫాల్లాతో పాసినో డేటింగ్ ప్రారంభించినట్టు నమ్ముతారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ జంట కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని ఫెలిక్స్ రెస్టారెంట్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ ఊహాగానాలు మొదలయ్యాయి. గత నెలలో పాసినో స్నేహితుడు బెన్నెట్ మిల్లర్‌ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు ఇద్దరూ హాజరయ్యారు. పాసినోతో డేటింగ్‌కు ముందు రోలింగ్ స్టోన్స్ సింగర్ మిక్ జాగర్‌తో అల్ఫల్లా డేటింగ్‌లో ఉంది. ఏడాదికిపైగా సాగిన ఆ బంధానికి 2018లో ముగింపు పలికారు. తర్వాత 2019లో నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌ఉడ్‌తో కలిసి ఆమె చెట్టపట్టాలేసుకుని తిరిగినా.. తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పింది. అల్ఫల్లాకు మొదటి సంతానం కాగా.. పాసినో నాలుగో సారి తండ్రవుతున్నాడు. అల్‌ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం. నటన శిక్షకురాలు జాన్‌ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ (33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు. రెండేళ్ల వయసులోనే తనను, తన తల్లిని విడిచిపెట్టిన తన తండ్రిలా ఉండకూడదనుకుని తన పిల్లలతో సన్నిహితంగా మెలగాలని భావిస్తానని పాసినో పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

Exit mobile version