Site icon NTV Telugu

Himachal Pradesh: రాజీనామాపై సీఎం సుఖ్వీందర్ సింగ్ క్లారిటీ

Cm Regisn

Cm Regisn

కాంగ్రెస్ పార్టీని (Congress) మరో రాజకీయ సంక్షోభం వెంటాడుతోంది. ఈసారి హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) వంతు వచ్చింది. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకటి హిమాచల్‌ప్రదేశ్, ఇంకొకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల్లోనే హస్తం పార్టీ అధికారంలో ఉంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల పుణ్యమా? అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త తలనొప్పి వచ్చి పడింది.

మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్న రాజ్యసభ సీటు కోల్పోయింది. ఒక సీటు బీజేపీ తన్నుకుపోయింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తీరుకు నిరసనగానే ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని మార్చాలని హైకమాండ్‌కు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఎమ్మెల్యేలు ఈ తెగింపునకు పాల్పడినట్లు సమాచారం. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి.

తాజాగా రాజీనామా వార్తలపై సుఖ్వీందర్ సింగ్ స్పందించారు. తాను రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పోరాట యోధుడునని తెలిపారు. అయినా తన రాజీనామాను ఎవరూ అడగలేదన్నారు. అలాగే తాను కూడా రాజీనామా లేఖ ఎవరికీ అందజేయలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా బలం నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజల మనసులను గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటామని సుఖ్వీందర్ సింగ్ పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండింట్ సభ్యులు బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. దీంతో రెండు పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో అనంతరం లాటరీ ద్వారా ఎంపిక చేయడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

 

Exit mobile version