Hilary Swank: దాదాపు 19 ఏళ్ళ క్రితం ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు క్లింట్ ఈస్ట్ వుండ్ డైరెక్షన్ లో రూపొందిన ‘మిలియన్ డాలర్ బేబీ’ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇందులో బాక్సర్ గా నటించిన హీరోయిన్ హిలరీ శ్వాంక్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిలరీ శ్యాంక్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప, ఒకరు బాబు. దీనికంటే విశేషమేమంటే ప్రస్తుతం హిలరీ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులో అదీ కవలలకు జన్మనివ్వడం శ్వాంక్ తో పాటు ఆమె అభిమానులకూ ఆనందం కలిగిస్తోంది.
హిలరీ శ్వాంక్ 1997లో ఛార్లెస్ డేవిస్ లోవ్ అనే యాక్టర్ ను పెళ్ళాడింది. పదేళ్ళ కాపురం తరువాత ఇద్దరూ విడిపోయారు. 2018 దాకా ఒంటరిగానే జీవనం సాగించిన శ్యాంక్ జీవితంలోకి భాగస్వామిగా వ్యాపారవేత్త ఫిలిప్ స్నెయిడర్ అడుగుపెట్టాడు. దాదాపు ఐదేళ్ళకు ఈ దంపతులకు పిల్లలు జన్మించడం వారికి మహదానందం కలిగిస్తోంది. దాంతో తమ కవలలను సోషల్ మీడియా ద్వారా లోకానికి పరిచయం చేశారు శ్యాంక్ దంపతులు. కవలలను దేవుడు తనకు ‘ఈస్టర్’ పర్వదినాన ఇచ్చిన కానుకగా భావిస్తున్నానని శ్వాంక్ అంటోంది.
