EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..

Eps Pension

Eps Pension

ఎంప్లాయిమెంట్ పెన్షన్ యోజన (EPS-1995) కింద హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు అజిత్ మాధవ్రావ్ గోపచ్డే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న హైయర్ ఈపీఎస్ పెన్షన్ కేసులలో జోక్యం చేసుకుని, అర్హులైన పెన్షనర్ల సమస్యలను ఒకేలాంటి నిబంధనలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులు, వివిధ కోర్టుల్లో నడుస్తున్న కేసులు, పెన్షన్ల చెల్లింపుల్లో అసమానతలు వంటి కీలక అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు.

2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తర్వాత హైయర్ పెన్షన్ అంశం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎక్కువ వేతనం ఆధారంగా ఈపీఎస్‌లో చందా చెల్లించి హైయర్ పెన్షన్ పొందేందుకు అర్హులైన ప్రస్తుత ఉద్యోగులకు కోర్టు మార్గం సుగమం చేసింది. అయినప్పటికీ, చాలా మంది ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్, డాక్యుమెంటేషన్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈపీఎఫ్ పథకంలోని పేరా 26(6) నిబంధనకు సంబంధించిన సమస్యలు హైయర్ పెన్షన్ క్లెయిమ్‌లను ప్రభావితం చేస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆగస్టు 2026లో రాజ్యసభలోనూ ఆయన ప్రశ్న లేవనెత్తారు.

సుప్రీంకోర్టు తీర్పును అందరికీ సమానంగా అమలు చేసేందుకు ఈపీఎఫ్‌ఓ చర్యలు తీసుకున్నప్పటికీ, ఒకేలాంటి పరిస్థితులున్న పెన్షనర్లు వేర్వేరు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, ట్రస్ట్ నిబంధనలు, న్యాయపరమైన ఆదేశాల అమలులో వ్యత్యాసాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే రకమైన సమస్యలకు సంబంధించి అనవసరమైన కోర్టు కేసులను తగ్గించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండాలని సూచించారు.

బీహెచ్‌ఈఎల్ (BHEL), సెయిల్ (SAIL) వంటి సంస్థల ట్రస్టుల్లో ఒకేలాంటి పరిస్థితులున్న ఉద్యోగులకు వేర్వేరు పెన్షన్ లాభాలు అందుతున్నాయనే ఫిర్యాదులను కూడా ఆయన ప్రస్తావించారు. ఈపీఎస్-1995 ఆర్థిక స్థితిగతులపై సమీక్ష జరపాలని, సెప్టెంబర్ 2026లో వేతన పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచిన నేపథ్యంలో ఈ సమస్య మరింత ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. పెరా 26(6) సమస్యల పరిష్కారం, అర్హులైన అందరికీ సమాన న్యాయం, కోర్టుల చుట్టూ తిరిగే అవసరాన్ని తగ్గించేందుకు సమర్థవంతమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రధానిని ఎంపీ కోరారు. ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనే దానిపై పెన్షనర్ల అందరి చూపు నిలిచింది.