NTV Telugu Site icon

Game Changer : గేమ్ ఛేంజర్ అదనపు షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం పై హైకోర్టు అసంతృప్తి

Gamechanger

Gamechanger

Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అదనపు షోలు, షో టైమింగ్స్, రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. పుష్ప 2 కేసుతో పాటు టికెట్ ధరల పెంపు అంశాన్ని కూడా విచారిస్తామంటూ కోర్టు పేర్కొంది. పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టికెట్ ధరలను పెంచబోము’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించిన నెల రోజుల లోపే, ప్రభుత్వం మాట మార్చి రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also:Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రయ్.. రయ్.. మంటూ 118 కి.మీ.ల మైలేజ్

ఈ నెల 10వ తేదీ ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఐదు షోలను ప్రదర్శించుకోవడానికి పర్మీషన్ కల్పించింది. అంతేకాకుండా, టికెట్ ధరలను అదనంగా 10వ తేదీన మల్టీప్లెక్స్‌లలో రూ.150 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లలో 100 రూపాయలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్‌లలో 50 రూపాయలు పెంచారు. ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read Also:Allu Arjun : మార్కో టీంను అప్రిషియేట్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Show comments