మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ సెమీఫైనల్‌లో భారత్ రికార్డు విజయం సొంతం చేసుకుంది. 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89), దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్) చెలరేగడంతో డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ విజయంతో భారత్ పలు ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకుంది.
# మహిళల వన్డే చరిత్రలో ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఈ ప్రపంచకప్‌లోని లీగ్ దశలో భారత్‌పై ఆస్ట్రేలియా సాధించిన 331 పరుగుల ఛేజింగ్ బ్రేక్ అయింది.
# వన్డే ప్రపంచకప్ నాకౌట్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను ఛేదించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకు ముందు ఏ పురుషు లేదా మహిళల జట్టు కూడా ఈ ఘనతను సాధించలేదు.
# భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 679 పరుగులు నమోదయ్యాయి. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇదే అత్యధికం. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా (678 పరుగులు, బ్రిస్టల్, 2017 ప్రపంచకప్) పేరిట ఉంది.
# మహిళల ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలిగా (22 ఏళ్లు) ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ నిలిచింది.
# ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధికంగా సిక్స్‌లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇరు జట్ల ప్లేయర్లు (భారత్ 5, ఆస్ట్రేలియా 9) 14 సిక్స్‌లు బాదారు.
