NTV Telugu Site icon

Heinrich Klaasen: హెన్రిచ్‌ క్లాసెన్‌ సంచలన నిర్ణయం!

Heinrich Klaasen

Heinrich Klaasen

Heinrich Klaasen Test Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్‌ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్‌ ఫార్మాట్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని క్లాసెన్‌ పేర్కొన్నాడు. 2019 నుంచి 2023 మధ్య దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

‘టెస్ట్‌ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ.. కొన్ని నిద్రలేని రాత్రులు గడిపా. సరైన నిర్ణయం తీసుకుంటున్నానా? అని చాలా ఆలోచించా. చివరకు నేను టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన ఫార్మాట్’ అని హెన్రిచ్‌ క్లాసెన్‌ తెలిపాడు. 4 టెస్ట్‌ల్లో క్లాసెన్‌ 104 పరుగులు మాత్రమే చేశాడు. 10 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. క్లాసెన్‌ 2019లో టెస్ట్‌ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన సమయంలో క్వింటన్ డికాక్‌ అప్పటికే జట్టులో స్థిరపడిపోయాడు. దాంతో క్లాసెన్‌కు సరైన అవకాశాలు రాలేదు. విధ్వంసకర ఆటగాడు అనే ముద్ర కూడా సెలెక్టర్లు టెస్ట్‌ జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి ఇంకో కారణం.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో హెన్రిచ్‌ క్లాసెన్‌కు మంచి రికార్డు ఉంది. 85 మ్యాచ్‌ల్లో 46.09 సగటుతో 5347 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉండగా.. కెరీర్-బెస్ట్ స్కోర్ 292. వన్డే, టీ20ల్లో కూడా క్లాసెన్‌కు మంచి రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో 1723 పరుగులు చేశాడు. 43 టీ20ల్లో 4 అర్ధ సెంచరీలతో 722 పరుగులు చేశాడు.