Site icon NTV Telugu

Bigg Boss 8 Grand Finale: నేడు బిగ్‌బాస్‌ 8 ముగింపు.. పోలీసుల భారీ బందోబస్తు!

Bigg Boss Telugu 8 Final

Bigg Boss Telugu 8 Final

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్‌ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్‌ 7 విజేతను ప్రకటించారు. విజేత పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానుల కారణంగా ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. పోలీసులు ముందస్తుగా స్టూడియో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 300 మంది పోలీసులు స్టూడియో వద్ద చుట్టుపక్కల ఉండనున్నారు.

సీజన్‌ 8లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్ట్ ఎంట్రీలతో 8 మంది షోలో పాల్గొన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్‌కు చేరుకున్నారు. నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, నబీల్‌, అవినాష్‌ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌, నిఖిల్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరి విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.

Exit mobile version