తెలుగు రాష్ట్రాలలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం నుంచి హైదరాబాద్‌లో కుండపోత వర్షం. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిచింది. దీంతో GHMC అలర్టయింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని నగరవాసులకు సూచించింది.
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలకు సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. 24 గంటలు ఫోన్ కాల్స్‌కు 24 గంటలు అందుబాటులో ఉండాలని .. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారీ వర్షాలకు పలు ప్రంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నీటిని క్లియర్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
మహానగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. సోమవారం, మంగళవారం, బుధవారం అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దాంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ జన్‌క్షన్ బాక్సులు, విద్యుత్ ఫెన్సింగ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్ వైర్లు తెగిన, దానికి సంబంధించిన ఇతర సమస్యలపై సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ లేదా టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి తెలపాల్సి వుంటుంది.
గులాబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాపై గులాబ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది శ్రీకాకుళం సిటీతో పాటు తీరప్రాంత గ్రామాలపై గులాబ్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తలిస్తున్నారు. విశాఖపై కూడా గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువుగానే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీలు జలమయ్యమయ్యాయి. చాలా చోట్ల కరెంట్ లేదు. పలు అపార్ట్ మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక విశాఖ ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా పోలీసు యంత్రాగం సహాయ చర్యలు చేపట్టారు. విద్యుత్ లేకపోవడంతో మినీ ల్యాంప్స్, సెల్ ఫోన్ వెలుగులోనే విరిగిన చెట్లను తొలగిస్తున్నారు.
గులాబ్ తుపాను తీరం దాటటంతో సోమవారం ఉత్తరాంధ్ర, చత్తీశ్‌గఢ్, తెలంగాణ, విదర్భల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ , ఉత్తర చత్తీశ్‌గఢ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర తీరం వెంట సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. మరో 24 గంటల వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
తుపాను ప్రభావానికి ఎక్కువగా ప్రభావితమయ్యే శ్రీకాకుళంలో తీరప్రాంత మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. తమ పడవలు, బోట్లు ఏమైపోతాయోనని భయపడుతున్నారు. మరోవైపు, వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా కొందరు తిరిగి రాలేదు. వారంతా వెనక్కి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ కోరారు. మత్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా నివారించాలలని అధికారులను ఆదేశించారు. గులాబ్ తుపాన్ రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. ఉత్తరాంధ్ర, ఒడిశాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లీంచారు. విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
