Site icon NTV Telugu

Bangalore Rains: భారీవర్షాలతో బెంగళూరు అతలాకుతలం

Rains Bangalore

Rains Bangalore

భారీవర్షాలు కర్నాటకు కుదిపేస్తున్నాయి. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో పలు ప్రాంతాలు వర్షాల కారణంగా జలమయమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బెంగళూరులో ఎకో స్పేస్ ప్రాంతంలో భారీగా నిలిచిపోయింది వర్షపు నీరు..సీవీ రామన్ నగర్‌ లో అత్యధికంగా 44 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బెంగళూరు నగరంలోని బెళ్లందురు, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లోని ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులో వరుణ ప్రతాపానికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్‌కు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. 10 నిమిషాలు వర్షం కురిస్తేనే సిటీ ఇలా అధ్వానంగా తయారైందని.. పెద్ద మొత్తంలో తాము కడుతున్న పన్నుల వల్ల ఇంక ఉపయోగం ఏంటని అంటున్నారు నెటిజన్లు. మరతహళ్లి నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ రోడ్‌లోని ఎకో స్పేస్ ఏరియాలో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు కొట్టుకుపోయాయి.

Read Also: Warm Water Health Tips: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిజమెంత..?

ఇదిలా వుంటే.. కర్ణాటకలో మరో ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 9 వరకూ ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లడం మంచిది కాదని సూచించింది. కొడగు, ఉత్తర కన్నడ, శివమొగ్గ, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. బెంగళూరు నగరం సహా కనీసం పది జిల్లాల్లో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మీకు అత్యవసరం అయిన పనిలేకుంటే ఈరోజు బయటకు వెళ్ళవద్దు. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా చోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుందని గుర్తించండి. దయచేసి మీ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ట్రాఫిక్ పోలీసులు వారి పనిలో ఉన్నారని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అనేకమంది రోడ్ల పరిస్థితిపై తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. హెచ్‌ఏఎల్ సమీపంలోని ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ అధికారుల గణాంకాల ప్రకారం బెంగళూరు నగరంలో సగటున 131 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా నగరమే కాదు విమానాశ్రయం కూడా నీటిలో మునిగింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని పార్కింగ్ బే మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది.

Read Also: CPI-M to support TRS : మునుగోడులో వాళ్ళు కలిసి నడవడం అసాధ్యమేనా..?

Exit mobile version