తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే.. ఈ రోజు రాజధాని హైదరాబాద్‌లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్ల పైకి నీరు చేరుకుంది. జూబ్లీహిల్స్, పెద్దమ్మ గుడి మెట్రో వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అయితే.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చందానగర్ లో 4.3 సెంటీమీటర్లు.. అత్తాపూర్ లో 2.3 సెంటీమీటర్లు.. మియాపూర్ లో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే.. బంజారాహిల్స్ లోని రోడ్లమీద వర్షపు నీళ్ళు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భాగ్యనగర వాసులు అవసరం ఉంటే తప్పా బయటకు రావద్దని బల్దియా ఆదేశాలు జారీ చేసింది.
