జులై నెల నుంచి ఆగస్టు తొలి వారం వరకు కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. నదులు, వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అయితే కొద్దిరోజులుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ వాసులకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర–దక్షిణద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి, సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నదని వెల్లడించింది వాతావరణ శాఖ. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.
కాగా, హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై సోమవారం తెల్లవారుజామున నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, కోఠి, ఉప్పల్, నాగోల్‌లో చిరుజల్లులు కురిశాయి. ఇదిలా ఉంటే.. ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి భారీ వర్షాలు కురిశాయి. అయితే.. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
