NTV Telugu Site icon

AP Rain Alert: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాన్ గండం.. రేపటి నుంచి భారీ వర్షాలు

Ap Weather

Ap Weather

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన వారు సాయంత్రంలోగా తిరిగిరావాలని సూచించారు. మండల స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read Also: Liquor Shops in AP: మద్యం షాపుల లాటరీకి వేళాయే.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు

తిరుపతి జిల్లాలో ఈ నెల అక్టోబర్ 14 నుండి 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్దంగా వుండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎట్టి పరిస్థితిలోనూ మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని పలు జలపాతాలు, పర్యాటక ప్రాంతాలైన కైలాసకోన, అరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్ నందు, సముద్ర బీచ్ ప్రాంతాల నందు… అక్టోబర్ 14 నుండి 17 వరకు నాలుగు రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యాటక సందర్శకులకు అనుమతి లేదని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో కూడా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అధికారులు సెలవుల్లో వుంటే వెంటనే విధుల్లోకి చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలకు ఆదేశించారు. వాగులు పొంగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.

 

Show comments