తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెల్లడించింది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎల్లో అలర్ట్ జారీ..
ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ వానలు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ఈదురుగాలుల ప్రభావంతో వర్షపాతం నమోదు కానుందని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, పాత భవనాల సమీపంలో లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితిని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం.. రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.

