NTV Telugu Site icon

Crop Damage: భారీ వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం

Crop Damage

Crop Damage

Crop Damage: ఏపీలో మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంకగ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీటమునిగిపోయాయి. ధాన్యం నీటిలో తడిసిముద్దైంది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై…కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్‌..తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు.

అటు…ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8వేల ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. ఎకరాకు 50 వేలు పెట్టుబడి పెట్టిన పంట…నాశనం అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోసిన వరి ధాన్యం…పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిగి ముద్దయ్యింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. వడ్లమన్నాడులో తుఫాన్ కారణంగా నీటమునిగిన వరిపొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తమ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతుల పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు కొడాలి నాని. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం జగన్‌ ఆదుకుంటారని ఆయనన్నారు.

రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించనున్నారు సీఎం జగన్‌. బాపట్లతో పాటు తిరుపతి జిల్లా గూడూరుతో సీఎం పర్యటిస్తారు. కోస్తాలో తుఫాన్‌ బీభత్సాన్ని, పెద్దమొత్తంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. తుఫాన్‌ అప్రమత్తత చర్యల్లో భాగంగా అధికారుల పనితీరు గురించి బాధితులనే అడిగి తెలుసుకుంటానని బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్.