NTV Telugu Site icon

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్‌.. ఫైనల్‌కు చేరిన రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు!

Vinesh Phogat Disqualified

Vinesh Phogat Disqualified

Vinesh Phogat Miss Paris Olympics 2024 Medal: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్‌ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్‌ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా వినేశ్‌ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఈరోజు రాత్రి జరిగే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన ఒలింపిక్స్‌ నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ అనర్హత వేటు వేశాయి. నిబంధనల ప్రకారం రజత పతకానికి కూడా వినేశ్‌ అనర్హురాలు. 29 ఏళ్ల వినేశ్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే ఒలింపిక్స్‌ 2024 ముందు తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది.

Also Read: Manu Bhaker: స్వదేశానికి చేరుకున్న మను బాకర్‌.. ఢిల్లీలో ఘన స్వాగతం! శనివారం మళ్లీ పారిస్‌కు

‘దురదృష్టవశాత్తు వినేశ్‌ ఫొగాట్‌ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’ అని భారత ఒలింపిక్‌ సంఘం పేర్కొంది.

Show comments