Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ వంటకాలలో రాగితో చేసే వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రాగి పిండితో తయారు చేసే కుడుములు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రాగిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఈ కుడుములను నూనెలో వేయించకుండా ఆవిరిపై ఉడికించడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ హెల్తీ రాగి కుడుములను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
అవసరమైన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* బెల్లం – ముప్పావు కప్పు
* నీరు – అర కప్పు
* కొబ్బరి తురుము – అర కప్పు
* నెయ్యి – 1 టేబుల్ స్పూన్
* యాలకుల పొడి – 2 నుంచి 3 యాలకులు
* నెయ్యి – చేతికి రాసుకోవడానికి కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా స్టవ్‌పై ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం వేసుకోవాలి. తరువాత అదే కప్పుతో అర కప్పు నీరు పోసి మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. దీనికి ప్రత్యేకంగా పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇప్పుడు బెల్లం నీళ్లలో రాగి పిండి వేసి మంటను సిమ్‌లో పెట్టాలి. రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ ముద్దలా అయ్యే వరకు ఉడికించాలి. రాగి పిండిని ముందుగా వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా బెల్లం నీళ్లలో వేసి కలిపితే సరిపోతుంది.
తర్వాత ఇందులో కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకుంటే మృదువైన ముద్దలా తయారవుతుంది. ఆ తరువాత పిండిని కొద్దిసేపు పక్కన పెట్టి గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని కుడుముల ఆకారంలో చేసుకోవాలి. మీకు ఇష్టమైతే రౌండ్ షేప్‌లో కూడా చేసుకోవచ్చు.
ఇలా తయారు చేసిన కుడుములను చిల్లుల గిన్నెలో లేదా ఇడ్లీ పాత్రలో అమర్చాలి. ఇప్పుడు స్టవ్‌పై పాత్ర పెట్టి అందులో రెండు లీటర్ల నీరు పోసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత కుడుముల గిన్నెను పెట్టి మూత పెట్టాలి. సిమ్ మంటపై సుమారు 20 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన రాగి కుడుములు సిద్ధం అవుతాయి.
