Healthy Protein Snacks: సాయంత్రం వేళ వేడివేడి టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? సాధారణంగా పకోడీ అంటే శెనగపిండితో చేస్తారు, కానీ అది అందరికీ పడదు (గ్యాస్ సమస్యలు రావచ్చు). అందుకే ఈరోజు మనం ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు పకోడీ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: AP Government: మత్స్యకారుల కుటుంబాలకు సర్కార్ గుడ్‌న్యూస్..
కావాల్సిన పదార్థాలు..
పొట్టు ఉన్న పెసరపప్పు – 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
పచ్చిమిర్చి తరుగు – 1/4 కప్పు
అల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
కచ్చా పచ్చాగా దంచిన ధనియాలు – 1 టేబుల్ స్పూన్
పుదీనా, కరివేపాకు – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
ఇన్‌స్టంట్ గ్రీన్ చట్నీ కోసం..
పుదీనా, కొత్తిమీర – తలా ఒక కప్పు
పచ్చిమిర్చి – 2
వెల్లుల్లి – 3 రెబ్బలు, అల్లం – చిన్న ముక్క
పుట్నాల పప్పు – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ – కొద్దిగా
తయారీ విధానం ..
ముందుగా ఒక కప్పు పొట్టు ఉన్న పెసరపప్పును శుభ్రంగా కడిగి, 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పొట్టు ఉండటం వల్ల పకోడీకి మంచి క్రిస్పీనెస్, ఫైబర్ లభిస్తుంది. మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుట్నాల పప్పు, ఉప్పు, కొంచెం పంచదార, జీలకర్ర పొడి, చాట్ మసాలా మరియు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చివరగా నిమ్మరసం కలిపితే హోటల్ స్టైల్ చట్నీ రెడీ. నానిన పెసరపప్పులో నీళ్లు వడకట్టి, ఒక గుప్పెడు పప్పు పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పును మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మిశ్రమం, పక్కన పెట్టిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పుదీనా, కరివేపాకు మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
కడాయిలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి చిన్న చిన్న పకోడీలుగా వేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. ఈ వేడివేడి పెసరపప్పు పకోడీలను మనం తయారుచేసుకున్న గ్రీన్ చట్నీతో కలిపి సర్వ్ చేయండి. దీనిపై కొంచెం నిమ్మరసం, చాట్ మసాలా చల్లిన ఉల్లిపాయ ముక్కలతో తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. తక్కువ సమయంలో, ఇంట్లోనే ఆరోగ్యకరంగా చేసుకునే ఈ పెసరపప్పు పకోడీని
పిల్లలకు, పెద్దలకు ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్‌గా పని చేస్తుంది. ఈ రెసిపీ ప్రత్యేకతలు ఏంటంటే.. ఇవి తింటే ఎలాంటి గ్యాస్ సమస్యలు ఉండవు, అలాగే పెసరపప్పు వాడటం వల్ల శరీరానికి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది.
మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో కుదిరినప్పుడు ప్రయత్నించి చూడండి.
