ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ మాటను నమ్మి చాలామంది ఇప్పుడు నూనె వస్తువులను మానేసి, మార్కెట్లో దొరికే ‘హెల్తీ స్నాక్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, మనం ఆరోగ్యకరం అనుకొని తినే ఆహారాలే మనల్ని రోగులుగా మారుస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనల మాయలో పడి మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి చూద్దాం.
1. ప్రాసెస్ చేసిన గింజలు (Processed Nuts):
గింజలు, విత్తనాలు ఆరోగ్యానికి మంచివే. కానీ మార్కెట్లో దొరికే సాల్టెడ్, రోస్టెడ్ లేదా మసాలా అద్దిన గింజల్లో ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి రుచిగా ఉండటం వల్ల మనం తెలియకుండానే ఎక్కువ మొత్తంలో తినేస్తాం. కనుక రోజుకు 25-30 గ్రాముల ముడి గింజలను (Raw Nuts) తీసుకోవడం ఉత్తమం.
2. రెడీమేడ్ స్మూతీలు & ప్యాకెట్ జ్యూస్‌లు:
పండ్లు, కూరగాయలతో చేశారు కాబట్టి ఇవి మంచివని మనం భావిస్తాం. కానీ, వీటిలో నిల్వ ఉండటం కోసం కలిపే ప్రిజర్వేటివ్స్, అదనపు చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అకస్మాత్తుగా పెంచుతాయి. కాబట్టి ఇంట్లోనే తాజా పండ్లతో అప్పటికప్పుడు చేసుకున్న జ్యూస్ లేదా స్మూతీలను తాగండి.
3. ప్రోటీన్ బార్స్ (Protein Bars):
జిమ్‌కు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ బార్లను ఎనర్జీ కోసం తింటుంటారు. నిజానికి వీటిలో ఉండే ‘హిడెన్ షుగర్స్’ (దాగి ఉన్న చక్కెరలు) డయాబెటిస్, ఊబకాయానికి దారితీస్తాయి. అందుకని బెల్లం, వేరుశనగలు, నువ్వులతో ఇంట్లోనే ప్రోటీన్ బార్స్ తయారు చేసుకోవడం మేలు.
4. గ్రానోలా మరియు కార్న్ ఫ్లేక్స్:
బ్రేక్ ఫాస్ట్ కింద వీటిని తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అయితే, వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువ. కంపెనీలు వీటిని రుచిగా మార్చడానికి చక్కెర సిరప్‌లను వాడుతుంటాయి. వీటి ఎంపికలో జాగ్రత్త వహించండి లేదా తక్కువ చక్కెర ఉండే ఓట్స్ వంటివి ఎంచుకోండి.
5. సలాడ్ డ్రెస్సింగ్:
సలాడ్ తినడం మంచిదే కానీ, దానిపై వేసే క్రీమీ డ్రెస్సింగ్స్, సాస్‌లలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సలాడ్ ఇచ్చే పోషక విలువలను తగ్గించి, శరీరంలో కొవ్వును పెంచుతాయి. నిమ్మరసం, మిరియాల పొడి లేదా ఆలివ్ ఆయిల్ వంటి సహజ సిద్ధమైన డ్రెస్సింగ్స్ వాడండి.
నిపుణుల సూచన:
ఏదైనా ఆహారాన్ని కొనే ముందు ప్యాకెట్ వెనుక ఉండే ‘న్యూట్రిషన్ లేబుల్’ చదవడం అలవాటు చేసుకోండి. అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి? ఎంత చక్కెర కలిపారు? అన్నది గమనించాలి. ‘సేంద్రీయ’ లేదా ‘హెల్తీ’ అనే బ్రాండ్ నేమ్స్ చూసి మోసపోకుండా, సహజ సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.
