Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

Palak Paratha Recipe

Palak Paratha Recipe

Healthy and Soft Palak Paratha Recipe: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు, కానీ పిల్లలకు పాలకూర తినిపించడం ఒక పెద్ద టాస్క్. అలాంటి వారందరి కోసం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం “పాలక్ పరోటా”. తక్కువ సమయంలో ఇంట్లోని పదార్థాలతోనే ఎంతో సాఫ్ట్‌ గా ఈ పరాఠాలను చేసుకోవచ్చు. ఇలా పాలకూరతో ‘పాలక్ పరోటా’ చేసి పెడితే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే.. బ్రేక్‌ఫాస్ట్‌ కైనా, లంచ్ బాక్స్‌ కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఈ పరాఠాలను లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:
* పాలకూర: 150 గ్రాములు (శుభ్రంగా కడిగి తరిగినది)
* గోధుమపిండి: 2 కప్పులు
* అల్లం-పచ్చిమిర్చి పేస్ట్: 1 టీస్పూన్
* కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
* రెడ్ చిల్లీ ఫ్లేక్స్: అర టీస్పూన్
* జీలకర్ర: అర టీస్పూన్
* వాము: కొద్దిగా
* పసుపు: చిటికెడు (ఆప్షనల్)
* నెయ్యి/నూనె/బటర్: కాల్చడానికి సరిపడా
* ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:
పాలక్ ప్యూరీ తయారీ:
ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు పోసి, ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోండి.

పిండిని కలుపుకోవడం:
ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి వేయాలి. అందులో అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, వాము, ఉప్పు, చిటికెడు పసుపు వేయండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి పిండిని బాగా కలపాలి.

డో (Dough) సిద్ధం చేయడం:
ఇప్పుడు గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్‌ను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అవసరమైతే తప్ప నీళ్లు వాడకండి. పిండి కలిపిన తర్వాత పైన కొద్దిగా నూనె రాసి, మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి.

పరోటా షేపింగ్:
10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీలా రోల్ చేసి, మధ్యలో నూనె రాసి, రెండు వైపులా మడిచి రోల్ చేయాలి. చపాతీని సగానికి మడిచి, మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి త్రిభుజాకారంలో రోల్ చేయడం లేదా మనకు ఇష్టమైన ఆకృతిలో చేసుకోవాలి.

కాల్చే విధానం:
వేడిగా ఉన్న పెనం మీద పరోటాను వేసి, మొదట రెండు వైపులా నూనె లేకుండా కొద్దిగా కాల్చాలి. ఆ తర్వాత నెయ్యి లేదా బటర్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చితే.. పరోటా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా వస్తుంది. పరోటా ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే పిండిలో కొద్దిగా నెయ్యి వేసి కలపడం మర్చిపోకండి. ఇవి వేడివేడిగా ఏదైనా రైతా లేదా ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటాయి. ఇలా చేసినవి లంచ్ బాక్స్‌ లో పంపేటప్పుడు హాట్ బాక్స్‌లో పెడితే మధ్యాహ్నం వరకు సాఫ్ట్‌ గానే ఉంటాయి.