సీజనల్ వ్యాధులకు వర్షాకాలం అనువైనది. ఎందుకంటే.. ఇప్పుడు వర్షాల ప్రభావంతో ఎక్కడపడితే అక్కడి నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. వ్యాధి నిరోధక శక్తి దెబ్బతినేది కూడా ఈ వర్షాకాలంలోనే. అందుకే మృగశిరకార్తె అంటూ ఈ సీజన్ ఆరంభంలోనే చేపలులాంటి పోషకాహారాలు తినాలంటూ పెద్దలు సూచిస్తుంటారు. అయితే ఇదే కాకుండా.. వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వ్యాధుల బారిన పడకుండా మంచి ఆహార అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. ప్రధానంగా బయటి ఆహారానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఒక వేళ బయట తినాల్సి వచ్చి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినడం ఉత్తమం. అయితే.. శుచి శుభ్రత ప్రాధాన్యం కాబట్టి.. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని భుజించడమే శ్రేయస్కరం.
ముఖ్యంగా ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవడం మంచిది. దీని వల్ల మీరు అనారోగ్యం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనితో పాటు.. కూల్ వాటర్‌ను పూర్తి పక్కన పెట్టి.. నీటిని వేడి చేసుకొని తాగాలి. దీనివల్ల వాటర్‌లో ఉండే బ్యాక్టీరియా నుంచే కాకుండా.. గొంతులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది. అల్లం-వెల్లుల్లి మీ నిరోధక శక్తిని పెంపోందించడానికి సహాయ పడుతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి క్రమం తప్పకుండా ఆవిరి పట్టించడం మంచిది.