NTV Telugu Site icon

INDvsAUS 2nd Test: రెండో రోజు ఆట సమాప్తం.. ఆసీస్ 61/1

12

12

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 12 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 61 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు లీడ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (6)ను జడేజా ఔట్ చేయడంతో 23 రన్స్ వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ట్రెవిస్ హెడ్‌ (40 బంతుల్లో 39 బ్యాటింగ్), లబుషేన్ (19 బంతుల్లో 16 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఆడారు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగులు ఆధిక్యంలో ఉంది.

ఆదుకున్న అక్షర్, అశ్విన్..

అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 270 రన్స్‌కు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, రవి అశ్విన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17 లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్.. టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ఆపై విరాట్ కోహ్లీ(44)తో కలిసి రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్‌కు 59 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశాక జడేజాను మర్ఫీ ఔట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ, భరత్ (6) ఔట్ అవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74) , రవి అశ్విన్ (71 బంతుల్లో 37) జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. అశ్విన్ నెమ్మదిగా సపోర్ట్ ఇవ్వగా.. అక్షర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్‌బోర్డును కదిలించాడు. ఏడో వికెట్‌కు 114 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశాక వరుస ఓవర్లలో అశ్విన్, అక్షర్ పెవిలియన్ చేరారు. అశ్విన్‌ను కమిన్స్‌ ఔట్ చేయగా.. అక్షర్‌ను మర్ఫీ బోల్తా కొట్టించాడు. అప్పటికే భారత్ స్కోరు 259. ఆసీస్‌ కంటే మరో 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. కాసేపటికే షమీ (2) కూడా వెనుదిరగడంతో 262 రన్స్‌ వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో ఆసీస్‌కు ఒక రన్ లీడ్ లభించింది. కంగారూ బౌలర్లలో లియోన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. మర్ఫీ, కునేమన్ చెరో రెండు వికెట్లు, కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

Also Read: Virendra Sehwag: ధోనీ కాదు.. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ రోహిత్: సెహ్వాగ్