NTV Telugu Site icon

karthikadeepam Effect : వంటలక్క, డాక్టర్ బాబులను చూడనీయడం లేదని వేళ్లు కొరికేశాడు

Karthika Deepam

Karthika Deepam

karthikadeepam Effect : కార్తీక దీపం సీరియల్ ఎంతటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అందులో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు చిన్న పిల్లల్లోకి కూడా చేరువైపోయాయంటే సీరియల్ ప్రభావం జనాలపై ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కార్తీక దీపం సీరియల్ ఎండ్ ఎపిసోడ్ నిన్న ప్రసారం అయింది. ఆఖరు ఎపిసోడ్ కోసం పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని ప్రేక్షకులంతా టీవీల ఎదుట తిష్ట వేశారు. ఆఖరి ఎపిసోడ్ చూడనివ్వడం లేదన్న చిరాకుతో ఓ వ్యక్తి వేలు కొరికేశాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలంపేటకు చెందిన గట్టు మొగిలి అనే వ్యక్తి తన గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. డాక్టర్‌ బాబు, దీపలను ఇక చూడలేనన్న బాధతో కార్తీకదీపం సీరియల్‌ ఆఖరి ఎపిసోడ్‌ చూస్తుండగా అరువు కోసం విసిగించిన ఓ వ్యక్తి చేతిని కొరికి రక్తం కళ్లజూశాడు ఆ దుకాణదారుడు.

Chandragiri Gurukul School: చంద్రగిరి బాలికల గురుకుల స్కూల్లో 110మందికి అస్వస్థతRead Also:

పాలంపేటకు చెందిన గట్టు మొగిలి కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడు. మద్యం కూడా విక్రయిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపెల్లి వెంకటయ్య జనవరి 23న రాత్రి మొగిలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడు. అనంతరం అరువుకు మరికొంత మద్యం కావాలని విసిగించాడు. ఈ తరుణంలో కార్తీకదీపం సీరియల్‌ చూస్తున్న మొగిలి సహనం కోల్పోయి వెంకటయ్యపై దాడి చేసి అతని కుడి చేతి చూపుడు వేలిని కొరికేశాడు. ఈ ఘటనపై వెంకటయ్య తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులు.. కార్తీక దీపం చూస్తుంటే విసిగించడంతోనే దాడి చేశానని మొగిలి చెప్పిన సమాధానంతో అవాక్కయ్యారు. మొగిలిపై కేసు నమోదు చేశారు. సీరియల్స్ ప్రభావం జనాలపై ఏ విధంగా ఉందో దీనిని బట్టి తెలుస్తుందని, సీరియల్స్ మాయలో పడి క్రైమ్స్‌కు పాల్పడుతున్నారని చెబుతున్నారు.