Site icon NTV Telugu

Coach Jai Simha: కోచ్ జై సింహా వెనకాల కొంత మంది ఉన్నారు.. సస్పెండ్ చేస్తే సరిపోదు!

Coach Jai Simha

Coach Jai Simha

మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాకు మద్దతుగా కొంత మంది ఉన్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ పేర్కొన్నారు. జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, అయినా ఇంటర్నల్ కమిటీలో కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. జై సింహాను సస్పెండ్ చేస్తే సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని బాబు రావ్ సాగర్ కోరారు. కోచ్ జై సింహా తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హెచ్‌సీఏ అతడిని సస్పెండ్ చేసింది.

హెచ్‌సీఏ సీనియర్ మెంబర్ బాబు రావ్ సాగర్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహాపై 2 నెలల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. జై సింహా వెనకాల కొంత మంది ఉన్నారు. అందుకే ఇంటర్నల్ కమిటీలో కనీసం విచారణ కూడా జరపలేదు. ప్రభుత్వం మహిళలకు క్రీడల్లో మంచి అవకశాలు ఇస్తుంది. కానీ ఇలాంటి చర్యలు చూస్తే ఏ తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడలకు పంపిస్తారు. జై సింహాపై ఎప్పుడూ ఫిర్యాదులు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదు. జై సింహాను సస్పెండ్ చేస్తే సరిపోదు. హెచ్‌సీఏలో ఇలాంటి వారిపై ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలి’ అని కోరారు.

Also Read: Hyderabad Womens Coach: హైదరాబాద్ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన.. కోచ్ జై సింహాను సస్పెండ్ చేసిన హెచ్‌సీఏ!

విజయవాడలో మ్యాచ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో హెడ్ కోచ్ జై సింహా.. మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బండ బూతులు తిట్టాడు. దాంతో మహిళా క్రికెటర్లు కోచ్‌ వ్యవహార శైలిపై హెచ్‌సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు సెలక్షన్‌ కమిటీ మెంబర్‌ పూర్ణిమ రావుపై కూడా వారు కంప్లైంట్‌ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో.. హెచ్‌సీఏ చర్యలకు దిగింది. జై సింహాను సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావు ఆదేశాలు జారీ చేశారు. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు పెడతాం అని తెలిపారు.

Exit mobile version