Goenka Jokes on Team India Jersey Sponsor: భారత జట్టు జెర్సీ స్పాన్సర్ ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ తన ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇకపై ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మూడేళ్ల కాలానికి డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందంను బీసీసీఐతో కుదుర్చుకుంది. కానీ ఉన్నపళంగా ఈ ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
డ్రీమ్ 11 కంటే ముందు భారత జట్టుకు చాలా సంస్థలు స్పాన్సర్‌గా వ్యవహరించాయి. సహారా, స్టార్, ఒప్పో, బైజూస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు టీమిండియా స్పాన్సర్‌గా వ్యవహరించాయి. అయితే ఈ కంపెనీలు అన్నీ కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బైజూస్ అయితే అదఃపాతాళానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తే.. కంపెనీలు మూసుకోవాల్సిందే అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా పరోక్షంగా చెప్పారు. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా చేస్తే.. బ్రాండ్ మనుగడకు పెద్ద పరీక్ష అని పేర్కొన్నారు.
Also Read: Viral Video: వామ్మో గద్ద.. చూస్తుండగానే ఎంత పని చేసింది!
‘మీ బ్రాండ్ మనుగడ నైపుణ్యాలను పరీక్షించాలనుకుంటున్నారా?. అయితే స్టాక్ మార్కెట్‌ను మర్చిపోండి. భారత క్రికెట్ జట్టు జెర్సీని స్పాన్సర్ చేయడానికి ప్రయత్నించండి’ అని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. గోయెంకా ట్వీట్‌పై నెటిజెన్స్ లైక్స్, కామెంట్స్ కురిపిస్తున్నారు. గోయెంకా చెప్పింది నిజమే అని పోస్టులు పెడుతున్నారు. నిజానికి 2001 నుంచి భారత క్రికెట్ జెర్సీని స్పాన్సర్ చేసిన ప్రతి కంపెనీ.. చివరికి ఏదో ఒక రూపంలో ఆర్థిక లేదా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.
