Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్‌లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. జట్టును ప్రకటించిన కొద్దిరోజుల్లేనే 41 బంతుల్లో సెంచరీ చేసి తాను ఎంత విలువైన ఆటగాడో అని ఈసీబీకి సంకేతాలు ఇచ్చాడు.
ఇంగ్లండ్‌లో జరుగుతోన్న ‘ది హండ్రెడ్’లో హ్యారీ బ్రూక్ తుఫాను ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన బ్రూక్.. కేవలం 41 బంతుల్లో సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. బ్రూక్ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. 50 నుంచి 100 పరుగులు చేయడానికి బ్రూక్ కేవలం 17 బంతులు మాత్రమే ఆడాడు. అంటే అతడి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
‘ది హండ్రెడ్’లో హ్యారీ బ్రూక్ నార్తర్న్ సూపర్ చార్జర్స్‌కు ఆడుతున్నాడు. నార్తర్న్ ఇన్నింగ్స్‌లో చివరి 10 బంతులు ఉండగా.. బ్రూక్ 76 పరుగులతో ఆడుతున్నాడు. చివరి 10 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు చేసి సెంచరీ అందుకున్నాడు. బ్రూక్ తుఫాను ఇన్నింగ్స్ కారణంగా 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన నార్తర్న్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు ఏకంగా 158 పరుగులు చేసింది. అయితే వేల్స్ ఫైర్ మరో 10 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
Also Read: Heath Streak Dies: క్యాన్సర్‌తో పోరాడి.. 49 ఏళ్లకే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం!
స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు కల్పించేందుకు హ్యారీ బ్రూక్‌ను ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పక్కన పెట్టింది. దాంతో చాలా మంది క్రికెట్ నిపుణులు ఇంగ్లండ్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఫామ్ ఆటగాడిని తప్పించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు అద్భుత ఇన్నింగ్స్‌తో బ్రూక్ ఈసీబీ తమ తప్పును గ్రహించేలా చేశాడు. సెలెక్టర్లపై కోపంతో దంచి కొట్టాడు. ఇప్పటికీ బ్రూక్ ప్రపంచకప్ 2023లో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల ప్రకటించింది ప్రిలిమినరీ జట్టే. ఆ జట్టులో మార్పులు చేసే అవకాశం ఇంకా ఉంది. మరి ఈసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.